నా కష్టాలు ఎవరితో చెప్పుకుంటా- కొబ్బరికాయ కష్టాలు

చిన్నది అనీ లేదూ పెద్దది అనీ లేదు ఏ కోరిక తీరాలన్నా నన్నే పగలకొట్టడం

మీ కోరిక తీరిన తర్వాత దేవుడికో దండం పెట్టేసి వదిలేయచ్చుగా ఆహా అలా కాదు,మళ్ళీ నన్నే ఇంకొద్ది ఉత్సాహంతో పగలకొట్టేయడం.

కోరిక పెద్దదైతే, నా కర్మకాలి అది తీరితే- నా దుంప తెగింది- ఓ నూటఎనిమిది సార్లు నన్ను పగలకొట్టేయడం! దిష్టి తీయాలన్నా నన్నే టపీమని పగలకొట్టేయడం-ఉదయమైనా,సాయంత్రమైనా!

మీరేకాదు ప్రతి హోటల్ వాడు-చిన్నాలేదు, పెద్దా లేదు, రోడ్డుమీద బండి హోటల్ అయినా, స్టార్ హోటల్ వాడయినా సరే- నన్ను పగలకొట్టందే తెల్లారదు; దీనికి తోడు, దిష్టితీసినా, కొత్తవాహనం కొన్నా,నిర్దాక్షిణ్యంగా నన్ను పగలకొట్టేయడమే-రోడ్డుకేసి.

ఇక పండగలప్పుడు చెప్పనే అక్కర్లేదు, పగవాడికి కూడా రాకూడదు నాకష్టాలు “ఆదివారాలు కోళ్ళని బతకనివ్వరే” అలాగ- నన్ను ప్రతిగుళ్లో, గుడికివెళ్లనివాళ్ళు ఇళ్లల్లో పగలకొడుతూనే ఉంటారు.

మీకు ఏ మాత్రం మంచి జరిగినా,మీకోరికలు,మొక్కులు తీరిపోయినా నన్ను పగలకొట్టేయడమే- ఓ వంద ప్రదక్షిణాలో, పొర్లు దండాలో పెట్టచ్చుగా- ఆహా… అలా కుదరదు- మీ వళ్ళు మీకు సుకుమారం- నేనే తేరగా దొరికాను మీకు!

వీటన్నితో సంబంధమే లేకుండా- ఇంట్లో కొబ్బరిపచ్చడి చేయాలన్నా,సాంబారు చేయాలన్నా-ఇంతెందుకు ఓ కొబ్బరిముక్క కావాలాంటే వంటింట్లోనే,కొద్దిగా సెంటిమెంట్ ఉన్నవాళ్లు-దేవుడికో కొబ్బరికాయ కొట్టి వంటిట్లో నన్ను వాడేసుకుంటారు- ముక్కలుచేసో, గ్రైండర్ లో పడేసో!

భక్తికి భక్తి, భుక్తిలోకి నేను-ఉభయతారకం- ఈ తెలివితేలికేం తక్కువ లేదు.ఇదే విషయం దేవుణ్ణి అడిగితే ఆయన ఏమీ చేయలేని పరిస్థితి “నా పేరు చెప్పి నాకోసమే కొడుతున్నారుగా నిన్ను, నేను మాత్రం ఏం చేయగలను” అంటూ మొత్తుకున్నాడు నాతో. ఏదో దేవుడూ అనుకుంటాం గానీ ఆయనికీ స్వార్ధమే-నన్ను సృష్టించినవాడే నన్ను పట్టించుకోని పరిస్థితి!

పైపెచ్చు “వాళ్లంతా నిన్ను పగలకొట్టేది నాకోసమే కదా- నీకు బోలెడంత పుణ్యం అని ఓదారిస్తుంటాడు”-ఓ పక్క నా వళ్ళు పగిలిపోతూ ఉంటే- ఇదికాదు “పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం” అంటే!

పీత కష్టాలు పీతవి అన్నారు గానీ-నాకష్టం గురించి ఎవ్వరూ ఒక్క ముక్క కూడా మాట్లాడరు!

నాకీ తిప్పలు ఎలాగూ తప్పేట్లు లేవు-కలియుగం ఉన్నంతవరకూ ఈ విధంగా మానవజాతికి ఉపయోగపడుతూ సంబరపడటం నేర్చుకుంటూ-నా మాడు పగులుతున్నా.మరి నేనూ నా జీవితాన్ని పాజిటివ్ గా చూడకపోతే ఉన్న నాలుగురోజులూ సుఖంగా ఉండలేనుగా!

కష్టం చెప్పుకుంటే కొద్దిగా స్వాంతన అంటారుగా, అందుకే ఇది...

కాకపోతే ఓ చిన్న విజ్ఞప్తి- నన్ను కొట్టేటప్పుడు కసితో కాకుండా, కాస్త నాజూకుగా, శ్రద్ధతో కొట్టండి కనీసం!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!